వద్దిపర్తి పద్మాకర్ పేరుపొందిన అవధాని, ఆధ్యాత్మిక ప్రవచనకారులు.[1]
వద్దిపర్తి పద్మాకర్ 1966, జనవరి 1నపశ్చిమ గోదావరి జిల్లా, జోగన్నపాలెంలో వద్దిపర్తి చలపతిరావు, శేషమణి దంపతులకు జన్మించారు.[2] తెలుగు, సంస్కృత భాషలలో ఎం.ఎ. చేశారు. హిందీ భాషలో సాహిత్యరత్న పట్టాను పొందారు. బి.యిడి శిక్షణ పూర్తి చేసిన తర్వాత ఏలూరులోని సి.ఆర్.రెడ్డి (కట్టమంచి రామలింగారెడ్డి) కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా చేరి 1993 నుండి 2004 వరకు పనిచేశారు.
ఈయన 1225కి పైగా అష్టావధానాలను, 11 శతావధానాలను, 1 త్రిభాషా సహస్రావధానం చేశారు. కొండపి మురళీకృష్ణతో కలిసి జంటగా కొన్ని అవధానాలను నిర్వహించారు. 756 పద్యాలను ఏకబిగిన 207 నిమిషాలలో ధారణ చేసిన ప్రతిభాశాలి.
ఇంతేకాక ఈయన 90 నిమిషాలలో 180పద్యాలను ఆశువుగా చెప్పగలిగిన కవి. ఏలూరు, విశాఖపట్నం, తాడేపల్లిగూడెం, చల్లపల్లి, గుంటూరు, రాజమండ్రి, నరసరావుపేట, హైదరాబాదు, సికిందరాబాదులతో పాటు సింగపూరు, అమెరికా వంటి దేశాలలో కూడా అవధానాలను చేశారు. ఆగ్రాలోనిహిందీ డైరెక్టరేట్‌లో హిందీలో అవధానం చేసి మెప్పించారు.
ఇతడు వందలాది సాహిత్యరూపకాలలో పాల్గొన్నారు. భువనవిజయంలోతెనాలి రామకృష్ణుడు, అవధాని విజయంలో చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, సుధర్మసభలో నారదుడు వంటి పాత్రలకు వద్దిపర్తి పద్మాకర్ ప్రసిద్ధుడు.
వద్దిపర్తి పద్మాకర్ ప్రణవపీఠం స్థాపించి అనేకమంది శిష్యులకు మంత్రోపదేశం చేశారు. భారత, భాగవత, రామాయణాదులే కాక అష్టాదశ పురణాల గురించి అనర్గళంగా ఉపన్యసించగలరు. ఆంధ్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలోను, నైమిశారణ్యం, శుకస్థల్, బృందావనం, వింధ్యాచలం మొదలైన పుణ్యక్షేత్రాలలోను, సింగపూర్, అమెరికా, దుబాయ్ వంటి దేశాలలోను దేవీభాగవత ప్రవచనాలు, అష్టాదశ పురాణప్రవచనాలు, లలితాసహస్రనామ భాష్యాలు, భాగవత సప్తాహాలు నిర్వహించారు.
ఇతని పద్యకళా ప్రావీణ్యాన్ని తెలియజేసే ఒక ఉదాహరణ:
పద్యము భారతీసతికి పాదయుగంబునఁబెట్టినట్టి నై
వేద్యము శ్రోత్రతాజన వివేకము, నవ్య మనోహరమ్ముగా
చోద్యముఁగొల్పు చుండు, కవిసూరి జనాళికి, పూర్ణ భావ
సం హృద్యము, పూర్వరాడ్జన వరిష్ఠ విశిష్ఠ వరప్రసాదమున్.